Followers

19 April, 2021

డార్విన్ గారి వర్ధంతి

@శ్రీనివాస్@

నేడు "చార్లెస్ రాబర్ట్ డార్విన్" గారి వర్ధంతి..

చార్లెస్ రాబర్ట్ డార్విన్ (ఆంగ్లం :Charles Robert Darwin) (ఫిబ్రవరి 12, 1809 – ఏప్రిల్ 19, 1882) ఇంగ్లాండుకు చెందిన ప్రకృతివాది,ఇతను, భూమిపై జీవజాలము ఏ విధంగా పరిణామక్రం చెందాయి అనే విషయంపై పరిశోధనలు చేశాడు. మరియు జీవపరిణామ సిద్ధాంతాన్ని వర్ణించాడు.

తండ్రి దృష్టిలో పనికిరాని వాడు.. ఉపాధ్యాయుల మాటల్లో మందబుద్ధివాడు.. ఇలా విమర్శల మధ్య ఎదిగిన ఓ కుర్రాడు.. అసలు మనిషి ఎలా పుట్టాడో చెప్పగలిగాడు! అతడే డార్విన్‌!
ఇంగ్లండులో ఒక డాక్టర్‌ తన స్నేహితులతో కొడుకు గురించి చెబుతూ బాధపడేవారు.. 'వాడొక పనికిమాలిన వాడు. మా కుటుంబానికి తీరని మచ్చ' అని. దానికి కారణం ఆ బాలుడు ఎప్పుడూ బొద్దింకలు, గొంగళి పురుగులు, సీతాకోక చిలుకల్లాంటి జీవుల్ని జాగ్రత్తగా పట్టుకుని ఇంటికి తెచ్చేవాడు. వాటికి తిండి పెడుతూ, పరిశీలిస్తూ కాలక్షేపం చేసేవాడు. ఇంట్లో ఎక్కడైనా దుర్వాసన వస్తే ఆ కుర్రాడు తెచ్చిన ఏ జీవో చచ్చి ఉంటుందని పెద్దవాళ్లు వెతికేవారు. అలాంటి కుర్రాడు పెరిగి పెద్దయ్యి ఈ భూమిపై జీవరాశులు ఎలా ఉద్భవించాయో, ఎలా పరిణామం చెందాయో, మానవుడు ఎలా పుట్టుకొచ్చాడో సాధికారికంగా చెప్పగలిగాడు. మానవ విజ్ఞానాన్నే మలుపు తిప్పిన గ్రంథం 'ద ఆరిజిన్‌ ఆఫ్‌ స్పీసీస్‌' రచించాడు. అతడే ప్రఖ్యాత జీవ శాస్త్రవేత్త ఛార్లెస్‌ డార్విన్‌.

డార్విన్‌ 1809 ఫిబ్రవరి 12న ఇంగ్లండులోని ష్రూస్‌బరీలో పుట్టాడు. వైద్యుడైన తండ్రి అన్ని సదుపాయాలూ సమకూర్చినా చదువులో రాణించలేదు. అతడొక మందబుద్ధిగా ఉపాధ్యాయులు భావించేవారు. తండ్రి వైద్యవిద్య కోసం ఎడింబరో విశ్వవిద్యాలయంలో చేర్చినా డార్విన్‌ కొనసాగించలేకపోయాడు. ఏదో ఒక డిగ్రీ సంపాదించాలనే తండ్రి కోరికపై కేంబ్రిడ్జ్‌లో తత్త్వశాస్త్ర అధ్యయనంలో చేరినా అక్కడా అంతే. అక్కడి ప్రొఫెసర్‌ ఓసారి అతడికి 'బీగల్‌' అనే ఓ నౌక కెప్టెన్‌కి పరిచయం చేశాడు. వివిధ దేశాల్లో, దీవుల్లో ఉండే జీవుల పరిశీలనకు అవకాశం ఉంటుందనే ఆలోచనతో డార్విన్‌ తన తండ్రి వద్దంటున్నా వినకుండా ఆ ఓడ ఎక్కేశాడు. ఆ నౌకాయానంలో డార్విన్‌ అనేక ప్రాంతాల్లో మొక్కలు, రాళ్లు, శిలాజాలు, కీటకాలు, జంతువులను పరిశీలించి చాలా నమూనాలను సేకరించి ఇంటికి పంపుతూ వచ్చాడు. ఆ పరిశీలనల ఆధారంగానే జీవజాతుల పరిణామ క్రమంపై పుస్తకం రాశాడు. 150 సంవత్సరాల క్రితం రాసిన ఈ గ్రంథం ఇప్పటికీ ప్రామాణికంగా నిలిచి ఉంది. జీవుల్ని ఏదో అతీత శక్తి ఏకకాలంలో సృష్టించలేదని, అవి వివిధ దశల్లో స్వాభావిక ఎంపిక (natural selection) ద్వారా పరిణామం చెందాయని డార్విన్‌ సిద్ధాంతం చెబుతుంది. ఇది ఇప్పటి మైక్రోబయాలజీ, జెనిటిక్స్‌, మాలిక్యులర్‌ బయాలజీలను సంఘటిత పరచడంలోనూ, డీఎన్‌ఏ పరీక్షల్లోనూ ప్రముఖ పాత్ర వహిస్తోంది.

చార్లెస్ డార్విన్ ప్రతిపాదించిన డార్విన్ జీవపరిణామ సిధ్ధాంతం (Darwin's theory of evolution) భూమి మీది జీవుల పరిణామ క్రమాన్ని తెలియజేస్తుంది. ఆధునిక జీవ శాస్త్రంలో డార్వినిజం చాలా మార్పు తెచ్చింది. మూఢ నమ్మకాలని విభేదించడంలో కూడా డార్వినిజం కీలక పాత్ర పోషించింది. మనిషి కోతి నుంచి వచ్చాడు, మనిషిని దేవుడు సృష్ఠించలేదన్న సిద్దాంతాన్ని తెర మీదకు తెచ్చింది. ఇప్పుడు కూడా సృష్ఠివాదం పేరుతో డార్వినిజాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు. డార్విన్ జీవ పరిణామ సిధ్ధాంతం మార్క్సిస్ట్ చారిత్రక భౌతికవాద రచనలకి కూడా ఊపిరిపోసింది. మలేషియా నుంచి రసెల్ వాలేస్ (1823- 1913) అనే వ్యక్తి పంపిన సిద్ధాంత వ్యాసం డార్విన్ వ్యాసం ఒకే విధంగా ఉన్నాయి. డార్విన్1844లో తన రచనను, వాలేస్ పంపిన వ్యాసాన్ని లియన్ సొసైటీ జర్నల్‌కు అందచేశాడు. 1858 జూలై 15న శాస్త్రవేత్తల సమావేశం జరిగింది. ఇరువురి వ్యాసాలు పరిశీలించారు. 1844లో డార్విన్ మొదలు పెట్టగా, వాలేస్ 1858లో రాశాడు. కనుక డార్విన్ ముందు రాసినట్టు నిర్ధారించారు.

ప్రస్తుతం ప్రపంచంలో కనబడుతున్న రకరకాల ప్రాణులు మొదటినుంచీ లేవనేది ఈ సిద్ధాంతం యొక్క ప్రధానమైన వాదన. కుక్కలూ, నక్కలూ, తోడేళ్ళూ ఒక జాతివనీ, పిల్లులూ, చిరతపులులూ, పెద్ద పులులూ, సింహాలూ మరొక జాతికి చెందినవనీ, గుర్రాలూ, గాడిదలూ, జీబ్రాలూ ఒకలాంటివే. గతంలో వీటికి తలొక "పూర్వీకుడూ" ఉండి ఉండాలి. ఇంకా వెనక్కెళితే ఈ "ఆదిమ" శునకానికీ, మార్జాలానికీ, అశ్వానికీ జన్మనిచ్చిన మరేదో మృగం ఉండి ఉంటుంది. ఇంకా ప్రాచీన యుగంలో ఈ క్షీరదాలకీ, తక్కిన చేపలూ, తాబేళ్ళూ, జలచరాలూ, పక్షులూ అన్నిటి ఆవిర్భావానికీ దారితీసిన ప్రాణి ఏదో ఉండే ఉంటుంది. వీటిలో కొన్ని శాకాహారులుగానూ, మరికొన్ని మాంసాహారులుగానూ రూపొందడానికి భౌతిక ప్రేరణలూ, పర్యావరణ పరిస్థితులే కారణాలు అయి ఉంటాయి. ఇన్నిరకాల ప్రాణులు "వాటంతట అవే" ఎలా ఉద్భవిస్తాయని వీరి వాదన సాగిపోతుంది.

ఉదాహరణకు ఆఫ్రికాలో పుట్టుకొచ్చిన మానవజాతి క్రమంగా ఉత్తరదిశగానూ, తక్కిన ప్రాంతాలకీ విస్తరించిందని శాస్త్రవేత్తలు ఊహిస్తున్నారు. ఉష్ణోగ్రత దృష్య్టా తొలిమానవులు నల్లని రంగులో ఉండి ఉంటారని అనుకోవచ్చు. ఉత్తరాన ఎండపొడ తక్కువగా పడే ప్రాంతాలకు వెళ్ళినవారి చర్మం తెల్లగా మారక తప్పలేదు. పూర్తిగా నల్లరంగులో ఉన్న ఒక మానవసమూహం తెల్లగా మారిపోవడానికి 20 వేల సంవత్సరాలు సరిపోతాయని అంచనా. తక్కిన జంతువుల సంగతి ఎలా ఉన్నా, ఒక్క మనిషిజాతినే తీసుకుంటే, చర్మం రంగూ, ముఖకవళికలూ అన్నీ కాస్తకాస్తగా మారడానికి జీవపరిణామ ప్రక్రియలే కారణమని రుజువు అవుతోంది. దీని కారణంగానే జీవపరిణామ సిద్ధాంతాన్ని కాదనేవారు ఎక్కువ సంఖ్యలో లేరు.

 ప్రశంసలు

చార్లెస్ డార్విన్ స్వంత దేశమైన బ్రిటన్ లో డార్వినిజం ఎన్నో ప్రశంశలు అందుకుంది. డార్వినిజం ప్రపంచంలో ఎంతో మంది భౌతిక శాస్త్రవేత్తలని, జీవ శాస్త్రవేత్తలని ప్రభావితం చేసి అధునిక భౌతిక శాస్త్ర విజ్ఞానాన్ని ఎన్నో మలుపులు తిప్పింది.

 విమర్శలు

కొన్ని క్రైస్తవ, ఇస్లామిక్ దేశాలలో డార్వినిజం చాలా వివాదాస్పదమయ్యింది. సృష్ఠివాదాన్ని వ్యతిరేకించడం దైవ ద్రోహం అని మతవాదుల వాదన. కొన్ని ఇస్లామిక్ దేశాలలో ఇప్పటికే ఈ సిధ్ధాంతాన్ని నిషేదించారు. ఈ సిద్ధాంతం తప్పని, జీవ పరిణామక్రమం జరగలేదని వాదించేవారిలో టర్కీ దేశానికి చెందిన ఇస్లామిక్ రచయిత హారూన్ యాహ్యా ఒకరు.


 

23 August, 2020

టంగుటూరి ప్రకాశం పంతులు గారి జయంతి


@శ్రీనివాస్@

సుప్రసిద్ధ స్వాతంత్ర్య సమర యోధుడు, ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి జయంతి నేడు...

ఆయన గుండెల మీద తెల్లజాతి ప్రభుత్వం గురిపెట్టిన తుపాకీ పేలడానికి భయపడింది. కానీ స్వజాతి నాయకత్వం మాత్రం ఆయన గుండెలని పగలగొట్టాలని విశ్వ ప్రయత్నమే చేసింది. అయినా నమ్మినదే చేశారాయన. కుమిలిపోలేదు. విశ్వసించినదానినే గౌరవించారు. వైరాగ్యాన్ని దరి చేరనీయలేదు. తుది పైసా కూడా జాతి స్వేచ్ఛ కోసం అర్పించారు. తన కడుపులో పేగులు ఆకలితో గాండ్రిస్తున్నా వినిపించుకోకుండా, ప్రజల క్షుద్బాధనే పట్టించుకున్నారాయన. అందుకు, ఆయన ‘ఆంధ్రకేసరి’. కానీ, ఆయన అణువణువూ సింహమే, అన్నారు రాజాజీ. ఆయన ఏం చేసినా ఆంధ్రుల అభ్యుదయం కోసమే అన్నారు జవహర్‌లాల్‌. నిజమే, చరిత్రలో ఎక్కడో గాని తారసపడని ఓ కచ్చితమైన ప్రజల మనిషి. ఆయన– టంగుటూరి ప్రకాశంపంతులు.  ఆంధ్రకేసరి జీవిత చరిత్ర మీద సింహావలోకనం చేసినా రోమాంచితం చేసే ఘట్టాలు కనిపిస్తాయి, అడుగడుగునా. ప్రకాశం (ఆగస్టు 23, 1872 – మే 20, 1957) చరిత్ర అంటే భారత స్వాతంత్య్రోద్యమ చరిత్రే అనకపోవచ్చు. టంగుటూరి ఉద్యమం అంటే ఆంధ్రుల ఉద్యమ చరిత్ర అని కూడా అనకపోవచ్చు. కానీ ప్రకాశం అంటే... దేవులపల్లి కృష్ణశాస్త్రి అన్నట్టు ‘మూడుకోట్ల జనం పేరు’. అంటే నాటి ముక్కోటి ఆంధ్రుల హృదయ స్పందన.  ఒంగోలు సమీపంలోని కనపర్తి అనే గ్రామంలో మేనమామల ఇంట ప్రకాశం పుట్టారు. తండ్రి గోపాలకృష్ణయ్య, తల్లి సుబ్బమ్మగారు. పూర్వీకులది టంగుటూరు. తరువాత ప్రకాశం గారి తాతగారు వల్లూరు వచ్చేశారు. కాబట్టి మాది వల్లూరే అని ప్రకాశం గారు రాసుకున్నారు. అద్దంకి, వినోదరాయుడిపాలెం, నాయుడుపేట, ఒంగోలు, రాజమహేంద్రవరాలలో ప్రకాశం బాల్యం గడిచింది. ప్రాథమిక విద్య కూడా ఆ ప్రాంతాలలోనే జరిగింది.

ప్రకాశం గారి జీవితంలో ఒంగోలు ప్రయాణం, అక్కడ నుంచి గోదావరి గట్టున రాజమహేంద్రవరానికి చేరుకోవడం ఆకస్మికంగా, నాటకీయంగా జరిగాయి. అవే ప్రకాశాన్ని తీర్చిదిద్దాయి. 1884లో గోపాలకృష్ణయ్య హఠాత్తుగా కన్నుమూశారు. దీనితో సుబ్బమ్మగారు ఒంగోలు చేరుకుని చిన్న భోజనశాలను ఏర్పాటు చేసింది. గోపాలకృష్ణయ్య మరణించేనాటికి సుబ్బమ్మగారు గర్భిణి. తండ్రి పోయిన తరువాత ఈ భూమ్మీద పడినవాడే జానకిరామయ్య. ప్రకాశం తమ్ముడు. ఆ నాలుగు మాసాల పురిటికందుతోనే, పచ్చి బాలింతగానే ఆమె ఒంగోలు వచ్చి దారుణమైన శ్రమకోర్చి ఆ చిన్న భోజనశాల నిర్వహించారు.అప్పటికి ప్రకాశం వయసు పన్నెండేళ్లు. ఒంగోలు పాఠశాలలో ఆనాటి ప్రధానోపాధ్యాయుడు బాగా చదివే పిల్లలను ఇంటికి రప్పించుకుని మరీ చదువు చెప్పేవారు. అలాంటి అవకాశం ప్రకాశంగారికి కూడా దక్కింది. అలా అని ప్రకాశం బుద్ధిమంతుడైన విద్యార్థి మాత్రం కాదు. ఒకవైపు పోకిరి పిల్లలతో కలసి అల్లరి. ఇంకోవైపు నాటకాలు. చిలిపి అల్లరి కాస్తా నేరాల స్థాయికి పోకుండా తనను కాపాడినవి నాటకాలేనని ప్రకాశంగారు భావించారు. నాటక పరిచయం ఒక కొత్త వెలుగును ఇచ్చింది. ప్రకాశం నిజ జీవితంలోకి ఒక గొప్ప పాత్రను ప్రవేశపెట్టింది రంగస్థలం. ఆయన మిడిల్‌ స్కూల్‌లో లెక్కల మాస్టారు.ఇంగ్లిష్, ఇంగ్లిష్‌ గ్రామర్‌ కూడా బాగా చెప్పేవారని ప్రతీతి. పేరు ఇమ్మానేని హనుమంతరావునాయుడు గారు. రాజమహేంద్రవరంలో మరో అంకం సాగడానికి కారకుడు కూడా నాయుడుగారే. నాయుడుగారు ముప్పయ్‌ రూపాయల జీతంతో పనిచేసే బతకలేని బడిపంతులే. ఆయనా, ప్రకాశం ఏ క్షణంలో కలుసుకున్నారో గాని, మానవ సంబంధాలలోనే అదొక మంచి ముహూర్తంగా చెప్పాలి. ఆయన శిష్యరికంలోనే ప్రకాశం మిడిల్‌ స్కూల్‌ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యారు. కానీ ఆ పరీక్షకు మూడు రూపాయల రుసుము చెల్లించాలి. ఇందుకోసం ఒంగోలుకి పాతికమైళ్ల దూరంలో ఉన్న బావగారింటికి నడిచి వెళ్లారు ప్రకాశం. కానీ బావ కూడా డబ్బు సర్దుబాటు చేయలేకపోయారు. చివరికి సుబ్బమ్మగారే తన పట్టుబట్టను తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చి కొడుక్కి ఇచ్చారు. పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాక కొత్త సమస్య వచ్చింది. మిడిల్‌ స్కూల్‌ పరీక్ష ఉత్తీర్ణత మెట్రిక్‌తో సమానం. అందుకే, ఏదో ఒక ఉద్యోగం చూసుకోమని బంధువుల నుంచి ఒత్తిడి వచ్చింది. అలా సుబ్బమ్మగారిని భోజనశాల పని నుంచి తప్పించాలన్నదే వారందరి కోరిక. కానీ ప్రకాశం జీవితాశయం న్యాయవాది కావడం. అదే చెప్పారు. ఆ తల్లి కూడా అందుకే మొగ్గారు. చదువు కొనసాగింది.

ఆ సమయంలోనే హనుమంతరావునాయుడు తన భార్య కోరిన మీదట రాజమండ్రి యాత్రకు బయలుదేరారు. వారి వెంటే ప్రకాశం రాజమండ్రి వెళ్లారు. ఒంగోలు నుంచి బెజవాడ. అక్కడ నుంచి విజ్జేశ్వరానికి ఎడ్ల బండి. అక్కడ గోదావరి దాటి రాజమహేంద్రవర పట్టణ ప్రవేశం. మొత్తం పదిరోజులు.  అనుకోకుండా నాయుడుగారు, ప్రకాశం గారు కూడా అక్కడ పాఠశాలలోనే చేరారు. చిలకమర్తి లక్ష్మీనరసింహంగారితో పరిచయం ఆ గోదావరి తీరంలోనే జరిగింది. గయోపాఖ్యానం, పారిజాతాపహరణ నాటకాలు నాయుడుగారు, ప్రకాశం గారి కోసమే చిలకమర్తి రాశారు. గయోపాఖ్యానంలో గయుని పాత్ర నాయుడుగారిది.గయుని భార్యగా ప్రకాశం నటించారు. కానీ నాటకాలతో ప్రకాశం చదువుకు మంగళం పాడకుండా అందుకయ్యే ఖర్చంతా నాయుడుగారే భరించేవారు. మెట్రిక్యులేషన్‌ ఇక్కడే పూర్తి చేశారు.అప్పుడే రాజమండ్రి సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసులో చిన్న గుమాస్తా ఉద్యోగానికి దరఖాస్తు చేశారు ప్రకాశం. జీతం నెలకి పద్నాలుగు రూపాయలు. అంత చిన్న వయసులోనే ప్రకాశం గారి తల వంచని తత్వం ఎంతటిదో బయటపడింది.  ఆ చిన్న కొలువుకీ అర్హత పరీక్ష అన్నారు. మెట్రిక్యులేషన్‌ సర్టిఫికెట్‌ ఉండగా మళ్లీ పరీక్ష ఏమిటి, ఈ ఉద్యోగం నాకు అక్కరలేదంటూ ప్రకాశం ఆ ఆఫీసుకి ఉత్తరం రాసి పడేశారు.అందుకే కాబోలు నాయుడుగారు ప్రకాశం గారిని రాజమండ్రి ఆర్ట్స్‌ కళాశాలలో ఎఫ్‌ఎలో చేర్పించారు. నాటక ప్రదర్శనలు సాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో రౌడీ గ్యాంగ్‌లతో పరిచయాలు పెరుగుతున్నాయి. ఆయన తొడగొట్టి అవతలి వాళ్లని చావగొట్టిన సంఘటనలు, వాళ్ల చేతిలో చావు దెబ్బలు తిన్న దుర్ఘటనలు కూడా జరిగిపోతున్నాయి. తన కంటూ ఒక గుంపును నిలబెట్టుకునే పనిలో బెస్తవాడలకి వెళ్లడం, వాళ్లు కల్లు తాగుతూ ఉంటే పక్కనే నిలబడడం వంటివి కూడా జరిగాయి. అవన్నీ ఎలా ఉన్నా తన ఆశయం – న్యాయవాది కావడం– గురించి ప్రకాశం మరచిపోలేదు. మద్రాస్‌ వెళ్లారు అందుకు. ఇదొక కొత్త అంకం. దీనికి తెర లేపిన వారు కూడా నాయుడుగారే. కొణితివాడ జమిందారు దగ్గర 90 రూపాయలు అప్పు చేసి శిష్యుడికి ఇచ్చారాయన. 1894 సంవత్సరంలో ప్రకాశం గారు రాజమండ్రి తిరిగి వచ్చి ప్రాక్టీస్‌ ప్రారంభించారు. మంచి పేరొచ్చింది. ఆ వెనుకే  డబ్బు కూడా ఉరుకుతూ వచ్చింది. 1901లో రాజమండ్రి మున్సిపల్‌ చైర్మన్‌ కూడా అయ్యారాయన. కానీ మళ్లీ కొత్త కోరిక. చిన్న కోర్టులలో కాదు, పెద్ద కోర్టులలో, పెద్ద పెద్ద కేసులు వాదించాలి. అందుకు బారెట్లా అవ్వాలి. చాలా ప్రతిఘటనల మధ్య ఇంగ్లండ్‌ వెళ్లారు ప్రకాశం.

లండన్‌ జీవితం, బారెట్లా చదువు ప్రకాశం గారికి ఒక కొత్త ఉషోదయాన్ని చూపించాయి. అంతవరకు ఆయన జీవిత గమనంలో కానరాని కొత్త కోణమది. ఈ పురాతన దేశం తనకు పడిన సంకెళ్ల బరువు, అవి తెచ్చిపెట్టిన న్యూనత ఎంత హీనమో, ఎంత అమానుషమో ఎలుగెత్తి ఘోషిçస్తున్న క్షణాలవి. జాతిలోని ఆ ఆక్రోశానికి పోరాట రూపం ఇస్తున్న స్వాతంత్య్రోద్యమ రూపశిల్పులతో యువ ప్రకాశానికి పరిచయం కలిగింది, అక్కడే.›అప్పుడే దాదాభాయ్‌ నౌరోజీ బ్రిటిష్‌ పార్లమెంట్‌కి పోటీ చేశారు. ప్రకాశం కూడా ప్రచారంలోకి దిగారు. ఇండియా సొసైటీతో పరిచయం ఏర్పడింది. భారత స్వాతంత్య్రోద్యమానికి విదేశాల నుంచి సాయం చేయడం, ఒక తరహా పోరాటాన్ని సమన్వయం చేయడం ఈ సొసైటీ ఉద్దేశం. అదే ‘ఇండియా’ పత్రికను కూడా వెలువరించేంది. సొసైటీ తరఫున గోపాలకృష్ణ గోఖలేని పిలిచి ఉపన్యాసం ఇప్పించారు.లాలా లజపతిరాయ్‌ని కూడా ప్రకాశం అక్కడే కలుసుకున్నారు. అందుకు వేదిక అయినది – శ్యాంజీ కృష్ణవర్మ నివాసం. ఈయన గదర్‌ వీరుడు. రమేశ్‌చంద్ర దత్తు, ఉమేశ్‌ చంద్ర బెనర్జీలు కూడా ప్రకాశం గారికి అక్కడే పరిచయమయ్యారు.

 బారెట్లా పూర్తి చేసిన తరువాత ఆయన మద్రాస్‌ హైకోర్టులో చేరారు. అక్కడ వద్దని ఎందరో నిరుత్సాహపరిచినా లెక్కచేయలేదు. పని చేసే చోటుతో కాదు, ఆ పని పట్ల  ఉండే విశ్వాసం, అసలు మనిషికి ఉండవలసిన ఆత్మ విశ్వాసం విజయానికి సోపానాలవుతాయని ప్రకాశం భావించారు. అదే నిరూపించారు కూడా. న్యాయవాదిగా ఆయన ఎన్నోసార్లు న్యాయమూర్తులతో సంఘర్షణకు దిగారు. న్యాయమూర్తుల అవాంఛనీయ ధోరణులను విమర్శించడానికి ఆయన ‘లా టైమ్స్‌’ అన్న పత్రికను కూడా వెలువరించారు. భారతదేశంలో చిత్తరంజన్‌దాస్‌కు ఆరోజులలో యువతలో విశేషమైన ఆకర్షణ ఉండేది. ప్రకాశం కూడా ఆయనను ఎంతో అభిమానించారు. దగ్గరయ్యారు. ఇద్దరికీ మైత్రి ఏర్పడింది. ఒకసారి ఒక లక్షాధికారి కేసు కోసం బొంబాయి వెళ్లినప్పుడు పూనా కూడా Ðð ళ్లి బాలగంగాధర తిలక్‌ను ‘దర్శించుకుని’ వచ్చారు. అప్పుడే గోపాలకృష్ణ గోఖలే అతివాదిగా పేరొందిన తిలక్‌ను తీవ్రంగా వ్యతిరేకించేవారు. అయినా గోఖలే పట్ల తిలక్‌ చూపుతున్న మర్యాద ప్రకాశాన్ని పరవశుడిని చేసింది. అందుకు గోఖలే స్పందన ఏవగింపు కలిగించింది. తన జీవితంలో అన్నీ ఆకస్మిక ఘటనలే అని రాసుకున్నారు ప్రకాశం. 1907లో బిపిన్‌ చంద్రపాల్‌ మద్రాస్‌ వచ్చారు. తెలుగునాట కాకినాడ మొదలుకొని మద్రాసు వరకు ఆయన సాగించిన ప్రయాణం జాతీయవాద జైత్రయాత్రగా మారిపోయింది.  మెరీనా బీచ్‌లో ఆయన సభకు అధ్యక్షత వహించడానికి అంతా భయపడుతున్న సమయంలో అప్పుడే ప్రాక్టీస్‌ ప్రారంభించిన ప్రకాశం ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి కడు సాహసంతో ముందుకు వచ్చారు. తరువాత హోంరూల్‌ ఉద్యమంలో అనిబిసెంట్‌ వెంట నడిచారు. 1917 నాటి కలకత్తా సభలకు గాంధీతో పాటు ప్రకాశం కూడా పాల్గొన్నారు. అప్పటికి ఆయన ఏ మాత్రం వక్త కాదని తేల్చారు ప్రకాశం. కానీ జాతీయ కాంగ్రెస్‌ చేపట్టిన కార్యక్రమాలను ప్రచురించడానికి హిందూతో సహా పత్రికలన్నీ సహకరించలేకపోయేవి. అందుకే 1921లో ప్రకాశం స్వరాజ్య పత్రికను స్థాపించారు.

1927లో సైమన్‌ కమిషన్‌ వచ్చినప్పుడు జరిగిన ఘట్టం ప్రకాశం అంటే ఏమిటో భారతదేశానికి తెలిసే అవకాశం ఇచ్చింది. మద్రాస్‌ నగరంలోని పారిస్‌ కార్నర్‌ దగ్గర సైమన్‌ గోబ్యాక్‌ ఉద్యమకారుల మీద కాల్పులు జరిగాయి. ఒక భారీకాయుడు రక్తపు మడుగులో పడి ఉన్నాడు. అతడి దగ్గరకు వెళ్లడానికి ఎవరూ సాహసించలేకపోయారు. అప్పుడే ప్రకాశం తెగించి ముందుకు వెళ్లారు. ‘మీరు బలవంతంగా వెళ్లదలిస్తే మేం కాల్చవలసి వస్తుంది’ అన్నాడు ఓ పోలీస్‌ ఆఫీసర్‌. అయితే అక్కడి గుంపులో ఉన్న ఒక మహమ్మదీయుడు ముందుకు వచ్చి, ‘ధైర్యం ఉంటే కాల్చు,  మేమంతా కూడా సిద్ధంగానే ఉన్నాం.ఆయన ఎవరో నీకు తెలియదల్లే ఉంది.’ అన్నాడు. అక్కడితో ఆ ఆఫీసర్‌ జులం తగ్గింది. ప్రకాశం ఆ యోధుడి భౌతికకాయాన్ని చూసి, సమీపంలోనే ఉన్న మద్రాస్‌ ప్రెసిడెన్సీ చీఫ్‌ మేజిస్ట్రేట్‌ను చూడ్డానికి వెళ్లారు. తరువాత గాంధీ పిలుపుననుసరించి (చాలా విషయాల్లో ఆయనతో విభేదించినా) లక్షలు ఆర్జించి పెడుతున్న న్యాయవాద వృత్తిని విడిచిపెట్టారు ప్రకాశం. ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు.అంతకు ముందే సెంట్రల్‌ లెజిస్టేటివ్‌ కౌన్సిల్‌కి ఎన్నికయ్యారు. ఏఐసిసి కార్యదర్శి అయ్యారు. రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షులయ్యారు. మద్రాస్‌ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. రాజాజీ మత్రివర్గంలో రెవెన్యూ మంత్రి అయ్యారు. వ్యక్తి సత్యాగ్రహం, క్విట్‌ ఇండియా ఉద్యమాలలో పాల్గొన్నారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి ఆయనే. కానీ అప్పటికే ఆయన తాను ఆర్జించిన సర్వం ప్రజలకు అర్పించేశారు. ఆయన దారిద్య్రం నుంచి వచ్చారు. ఈ పదవులు, ఆర్జనలు, హోదాలు ఒక భ్రమ అన్న రీతిలో తృణప్రాయంగా వదిలి పెటి మళ్లీ దారిద్య్రాన్ని ఆనందంగా ఆలింగనం చేసుకున్నారు. చినిగిన దుస్తుల్లో, చిల్లులు పడ్డ శాలువతో, తిండిలేక డస్సిపోయిన ముఖంతో విజయవాడ వీధులలో, రాష్ట్రంలో అనేక చోట్ల ఆయనను చూసిన వారు ఆ దృశ్యాలను ఎప్పటికి మరచిపోలేకపోయారు.

తల్లి సుబ్బమ్మగారు అంతిమక్షణాలలో కొడుకును పిలిచింది. ఒక చిన్న మూటను అప్పగించింది. ఎనిమిది వందల రూపాయలున్నాయి అందులో. ఆమె కష్టార్జితం. ‘తన అంత్యక్రియలకి’ అని చెప్పారావిడ. కన్నతల్లి రుణాన్ని తీర్చుకునే అవకాశం కూడా నాకు మా అమ్మ ఇవ్వలేదు అని విలపించారాయన.   అయినా, దేశమాత రుణాన్ని ప్రకాశం గారు తీర్చుకున్న తీరు ఎప్పటికీ ఒక అద్భుతం.

16 August, 2020

శ్రీ రామకృష్ణ పరమహంస గారి వర్ధంతి


@శ్రీనివాస్@

ఆధ్యాత్మిక గురువు శ్రీ రామకృష్ణ పరమహంస గారి వర్ధంతి నేడు...

శ్రీరాముడు ధర్మస్వరూపుడు. శ్రీకృష్ణుడు ధర్మ సంరక్షకుడు. శ్రీరామకృష్ణ పరమహంస సర్వధర్మస్వరూపంగా పరిగణించబడినాడు. వివేకానందుడు ఇతని ప్రియతమ శిష్యుడు.

సామాన్య పూజారిగా జీవితాన్ని మొదలు పెట్టిన ఇతను కాళీమాత ఉపాసనతో, అనుగ్రహంతో సర్వధర్మసారాన్ని ప్రపంచానికి తెలియజేసి ఆదర్శపురుషుడిగా వెలుగొందినాడు. ఈయన పేరు మీద నేడు రామకృష్ణ మిషన్ ఎన్నో ఆధ్యాత్మిక, సేవా, సాంస్కృతిక కార్య్రక్రమాలను నడుపుతూ ప్రపంచమంతా వ్యాపించింది.

ఆయన కాళిమాతకు వీరభక్తుడు. ప్రియమైన పుత్రుడు. తను పిలిచినప్పుడల్లా పలికి పరమానందానుభూతిలో ముంచెత్తే కాళీమాత ఆయన దృష్టిలో దేవత కాదు, సజీవ సత్యం. ఐతే ఈ ఆనందం కూడా ఒక బంధనమేనన్న ఆలోచన మదిలో మెదలి అంతకుమించిన జ్ఞానాన్ని పొందేదిశగా ప్రయత్నాలు చేసి, రామకృష్ణ పరమహంసగా ఆధ్యాత్మిక చరిత్రలో నిలిచారు.

రామకృష్ణులకు తల్లిదండ్రులు పెట్టిన పేరు గదాధరుడు. చిన్ననాటినుండి చదువు, సంపాదనల మీద ఆసక్తి చూపించని రామకృష్ణులు ప్రకృతిని ప్రేమిస్తూ, ప్రకృతిలోనే విహరిస్తూ సమయాన్ని గడిపేవారు. ఒకనాడు ఆలయంలోని కాళిమాతను చూసి ఆమె బొమ్మకాదని... తను పిలిస్తే పలుకుతుందని నిశ్చయించుకుని ఆ కాళీమాతకు పూజలు చేస్తూ అహర్నిశం అమ్మవారి ధ్యాసలోనే గడిపి అమ్మ దర్శనాన్ని పొందారు.

తోతాపురి అనే సాధువు ఉపదేశించిన అద్వైతజ్ఞానం రామకృష్ణుల జీవితాన్ని మలుపు తిప్పింది. తన భార్య శారదాదేవినే మొదటి శిష్యురాలిగా చేసుకుని తాను గురువు వద్ద నేర్చుకున్న విద్యలన్నీ ఆమెకు నేర్పారు. ఆమెను సాక్షాత్తూ కాళికాదేవిలా భావించి పూజించారు. వివేకానందుడు మొదలుకుని భగవంతుడిని తెలుసుకోవాలనే తపనగల మరెందరికో తన జ్ఞానానుభావాలను పంచారు.

భగవంతుని ఆశ్రయం పొందడానికి అత్యంత ప్రేమతో సాధన చేయాలి. తనకోసం బిడ్డ అటూ ఇటూ పరుగులు పెట్టే బిడ్డను దగ్గరకు తీసుకోని తల్లి ఉంటుందా? అంటూ భక్తికి అనురాగాన్ని ముడివేసేవారు. మనస్సును సరైన దిశలో పయనింపజేస్తే అసాధ్యాలను సుసాధ్యం చేస్తుంది. కానీ దానికి దిశానిర్దేశం చేయడంలో మన వివేకం, విజ్ఞతలను ఉపయోగించకపోతే, అదుపుతప్పిన గుర్రంలా పరుగెడుతుందనే వారి మాట ఆధ్యాత్మికానికే కాదు.... అన్నింటా అనుసంధానించవలసినది. భగవన్నామాన్ని వినడానికి లక్ష చెవులున్నా చాలవు. ఎన్నిసార్లూ ఆ నామాన్ని నోటితో జపించినా తృప్తి కగదు. ఎప్పుడైతే ఆ నామం మనసులో ప్రకంపనలను కలగజేస్తుందో అప్పుడు ఇంద్రియశుద్ధి కలుగుతుంది. కామం, అసూయలనే రెండు శత్రువులను తొలగించుకున్ననాడు భగవంతుని దర్శించడం అందరికీ సాధ్యమవుతుంది. ఇదే వారి జీవనసందేశంగా సాధకులు గ్రహించగలుగుతారు.

అటల్ బిహారీ వాజ్ పేయి గారి వర్ధంతి


@శ్రీనివాస్@

నేడు భారతరత్న అటల్ బిహారీ వాజ్ పేయి గారి వర్ధంతి..

భారత దేశ రాజకీయ చరిత్రలోనే అటల్ బిహారీ వాజ్ పేయి రెండు సీట్ల పార్టీని అధికార పార్టీగా మలచిన అపర చాణుక్యుడు. రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని పదిలంగా సుస్థిరపరచుకున్న నేత. ప్రతిపక్షాల విమర్శలకు అంతే స్థాయిలో సమాధానాలు వారి చేతే శభాష్ అనిపించుకునేవారు. దాయాది దేశం పాకిస్థాన్ తో యుద్ధ వాతావరణం సమయంలో తనదైన శైలిలో మాటల తూటాలు వదిలారు. పాకిస్థాన్ దేశంలో ఓ ప్రముఖ నేత రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు వస్తాయి. ఒక చేత్తో ఏమి చేయలేరని అంటే అందుకు వాజ్ పేయి బదులిస్తూ రెండు చేతులు కలిస్తే చప్పట్లు వస్తాయనేది నిజమే కానీ ఒక చేత్తో కనీసం చిటికెలైనా వేయొచ్చని ధీటుగా బదులిచ్చారు.

వాజ్ పేయీ మధ్యప్రదేశ్ రాష్ట్రం గ్వాలియర్లో 1924 డిసెంబర్ 25వ తేదీన క్రిష్ణదేవి, క్రిష్ణబిహారీ వాజ్ పేయీలకు జన్మించారు. ఆయన తండ్రి ప్రధానోపాధ్యాయులు. దీంతో వాజ్ పేయీ ప్రాథమిక విద్య అంతా గ్వాలియర్ లోని సరస్వతి శిశు మందిరంలోనే సాగింది. అనంతరం అక్కడే విక్టోరియా కళాశాలలో గ్రాడ్యుయేట్ పట్టా పొందారు. అనంతరం కాన్పూర్ వెళ్లిన ఆయన ఎంఏ పొలిటికల్ సైన్స్ చేశారు. 1939లో ఆర్ ఎస్ ఎస్ లో చేరారు. 1944 నుండి ఆర్ ఎస్ ఎస్ లో పూర్తి స్థాయి కార్యకర్తగా ఎదిగారు. ఆర్య సమాజ్ కు 1944లో జనరల్ సెక్రటరీగా పనిచేసిన ఆయన విభజన అల్లర్లు కారణంగా విద్యకు మధ్యలోనే స్వస్తి చెప్పారు. అనంతరం ఉత్తరప్రదేశ్ లోని కొన్ని పత్రికల్లో పనిచేశారు. 1975 ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ టైమ్ లో వాజ్ పేయీ కొందరు ప్రతిపక్ష నేతలతో కలిసి జైలుకు కూడా వెళ్లి వచ్చారు.

బిజెపి అగ్రనేత అద్వానీతో కలిసి 1980లో ఏప్రిల్ 6వ తేదీన బిజెపిని స్థాపించారు. అప్పుడు తొలి అధ్యక్షుడిగా ఆయనే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తొలి రోజుల్లో రెండు సీట్లకే పరిమితం అయిన 1996 సాధారణ ఎన్నికలు వచ్చేసరికి ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థాయికి తీసుకెళ్లిన ఘనత వాజ్ పేయీ, అద్వానీలదే. అప్పట్లో తొలిసారిగా కాంగ్రెసేత ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.అనేక నాటకీయ పరిణామాల మధ్య 1999 సంవత్సరంలో ముచ్చటగా మూడోసారి ప్రధాని పీఠాన్ని కైవశం చేసుకున్నారు. 2000లో ఆయన ఎన్నో ప్రతిష్టాత్మక సంస్కరణలు తీసుకొచ్చారు. వాటి ఫలాలే నేడు మనం అనుభవిస్తున్నాం. అవి దేశానికి ఎంతగానో మేలు చేశాయి.ఆయన హయాంలో ఇండియా సక్సెస్ గ్రోత్ ఎంతగానో మెరుగుపడింది.

ఇలా ఆయన గురించి చెప్పుకుంటూ పోతే చెప్పాల్సింది చాలానే ఉంటుంది. ఆయన గురించి ఒక్క మాటలో చెప్పాలంటే అందరినీ నవ్వించడంలో ఆయనకు ఆయనే సాటి. ప్రసంగాల మధ్యలో కవితల్ని కలగలపి అందరితో ఔరా అనిపించుకోవడంలో ఆయనకు ఎవరూ లేరు పోటీ.. ఆయన వాగ్ధాటిని చూసిన అప్పటి ప్రధాని నెహ్రు ఓ సందర్భంలో భవిష్యత్తులో అటల్ జీ ప్రధాని అవుతారని జోస్యం చెప్పారట.

వాజ్ పేయి తమకున్న అభిమానాన్ని బిజెపి తమదైన శైలిలో చాటుకుంది. ఆయన పుట్టినరోజును సుపరిపాలన దినోత్సవంగా ప్రకటించింది మోడీ ప్రభుత్వం. ఆయన చేసిన సేవలను గుర్తించి 2015లో భారత రత్న అవార్డుతో సత్కరించింది. ఆయన మధ్య లేకపోయినా ఆయన ఆశయాలు ఇప్పటికే మన మధ్య సజీవంగానే ఉన్నాయి.

13 August, 2020

నేడు లెఫ్ట్ హ్యాండర్స్ డే

@శ్రీనివాస్@

నేడు లెఫ్ట్‌ హ్యాండర్స్‌ డే

చేయి మారినా రాత మారలేదంటారు. ఎడమ చేతివాటం వారికి మాత్రం ఇది వర్తించదు. ఎందుకంటే లెఫ్ట్‌ హ్యాండర్స్‌ అయితే ప్రముఖులుగా వెలుగొందుతారని ఓ నమ్మకం. ఎందరో దేశాధినేతలు, క్రీడాకారులు, నటీనటులు లెఫ్ట్‌ హ్యాండర్స్‌ కావడం ఈ నమ్మకాన్ని నిజం చేస్తోంది. ఎడమ చేతివాటం ఉన్న వారిలో అసాధారణ ప్రతిభాపాటవాలు ఉంటాయని, ప్రత్యేక వ్యక్తులుగా వెలుగొందుతారని అంటారు.

ఏదైనా పని ప్రారంభించేటప్పుడు ‘కుడి’ పదం వాడడం సర్వసాధారణం. కుడి చేతితో చెయ్యి, కుడికాలు పెట్టు...అన్నమాటలు తరచూ వింటుంటాం. శరీర అవయవాల్లో దేని ప్రాముఖ్యం దానిదే అయినా మనిషి జీవనం సాఫీగా సాగేందుకు ఎంతో ముఖ్యమైనవి కాళ్లు, చేతులు. ప్రయాణానికి కాళ్లు, పనులు చేసేందుకు చేతులు ప్రధానం. చేతుల్లో కుడి చేతివాటం, ఎడమ చేతివాటం వారని రెండు రకాలు. చేసేపని ఒక్కటే అయినా ఒక్కొక్కరికీ ఒక్కో చేతితో చేయడం సౌలభ్యంగా ఉంటుంది. అయితే జనాభాలో 90 శాతం మంది కుడిచేతితోనే ఏదైనా పనిచేస్తారు. మిగిలిన పది శాతం ఎడమచేతివాటం. అందుకే వారు ప్రత్యేకం. ప్రతి పదిమందిలో ఒకరు ఎడమ చేతివాటం వారని అంచనా. ఎడమ చేతివాటం అన్నది శారీరకంగా, మానసికంగా అబ్బి న అలవాటు. కొందరు పిల్లలు అన్నిపనులు ఎడమచేతితోనే చేస్తుంటారు. ఇటువంటి వారికి తల్లిదండ్రులు కుడిచేతితో తినడం, ఇతర పనులు బలవంతంగా అలవాటు చేస్తుంటారు. అయినప్పటికీ కొంతమందికి ఇవి అబ్బవు. ముఖ్యంగా పనులు చేయడం, రాయడం వంటివి మారడం చాలా అరుదు. ఇది ఒక శారీరక, మానసిక ప్రక్రియ అని విశ్లేషకులు భావిస్తున్నారు.

నలభై ఏళ్ల తరువాత ఎవరికైనా పిల్లలు పుడితే సాధారణంగా వారు ఎడమచేతి వాటం వారై ఉంటారని చెబుతారు. బిడ్డ తల్లిగర్భంలో ఉన్నప్పుడు వాతావరణంలో మార్పులు కారణంగా 75 శాతం ఎడమ చేతివాటం వస్తుందని, కొన్ని సర్వేల్లో తేలింది. జన్యువులు కారణంగా ఎడమ చేతివాటం రావడానికి 25 శాతం అవకాశం ఉంది. ఎడమచేతివాటం వారు గొప్ప అదృష్టవంతులవుతారని, ప్రత్యేక గుణాలు కలిగి ఉంటారని, సమాజంలో పేరు ప్రఖ్యాతులు సాధిస్తారని, గర్వించదగ్గ విజయాలు నమోదు చేస్తారని పలుసందర్భాల్లో నిరూపితమైంది. అందుకే ఎడమ చేతి వాటానికి అంత ప్రాముఖ్యం.

ఫ్రెండ్‌షిప్‌డే, మదర్స్‌డే, ఫాదర్స్‌డే, వాలంటైన్‌ డేలా ఆగస్టు 13న అంతర్జాతీయ ఎడమచేతివాటం వ్యక్తుల దినోత్సవం (లెఫ్ట్‌హ్యాండర్స్‌ డే) జరుపుతున్నారు. ఎడమచేతివాటం వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు 1976 ఆగస్టు 13 నుంచి ఈ దినోత్సవాన్ని నిర్వ హిస్తున్నారు.

ఎడమచేతి వాటం వారిలో ప్రపంచ వ్యాప్తంగా రాజకీయ, సామాజిక, క్రీడా రంగాల్లో ఎందరో ప్రముఖులు ఉన్నారు. రాణీలక్ష్మీబాయి, మహాత్మాగాంధీ, ప్రధాని నరేంద్ర మోదీ, ఆల్‌బర్ట్‌ ఐన్‌స్టీన్‌, చార్లెస్‌ డార్విన్‌, న్యూటన్‌, బెంజిమిన్‌ ప్రాంక్లిన్‌, బిల్‌క్లింటన్‌, జార్జిబుష్‌, ఒబామా, రతన్‌టాటా, సచిన్‌ టెండూల్కర్‌, రవిశాస్త్రి, సౌరవ్‌గంగూలీ, యువరాజ్‌ సింగ్‌, సురేష్‌ రైనా, శిఖర్‌థావన్‌, కుంబ్లే, జహీర్‌ ఖాన్‌, అమితాబచ్చన్‌, అభిషేక్‌ బచ్చన్‌, మహానటి సావిత్రి, సూర్యాకాంతం, మమ్ముట్టి ఇలాంటి ప్రముఖులు ఉన్నారు.

ఎడమచేతి వాటం వారి లక్షణాలు:
కలలు కంటారు. వాటి సాకారానికి శక్తి వంచన లేకుండా శ్రమిస్తారు.
స్వతంత్ర భావాలు, జ్ఞాపక శక్తి మెండు. నిత్యనూతనంగా (సృజనాత్మకత) ఆలోచనా విధానం వీరి సొంతం.
ఎంత ఒత్తిడినైనా తట్టుకునే గుణం వీరి సొంతం.
ఒకేసారి ఎక్కువ పనులు చేయగల సత్తా ఉండడం వల్ల బహుళ లక్ష్యాల సాధనలో ప్రావీణ్యం కలిగి ఉంటారు.
చిత్రాలు గీసేటప్పుడు అవి కుడివైపు అభిముఖంగా ఉంటేటట్టు గీస్తారు. ఎడమవైపు తిరిగి ఉన్న చిత్రాలు గీయడానికి చాలా కష్టపడతారు.
బ్రెయిన్‌ స్ట్రోక్‌ వచ్చినా కుడిచేతి వాటం వారి కంటే త్వరగా కోలుకుంటారు.
కుడిచేతివాటం వారి కోసం రూపొందించిన పరికరాల వినియోగం వల్ల ఏటా 2,500 మంది ఎడమ చేతివాటం వారు మృతి చెందుతున్నట్లు సర్వేలు చెబుతున్నాయి.
వీరికి అసహనం, కోపం తొందరంగా వస్తాయి.
కళ, భాష, సంగీత రంగాల్లో వీరు ఎక్కువగా రాణిస్తారు. మొదడు, మనోవ్యాధులతో సతమతమవుతుంటారు.

 ఎడమచేతి వాటం వారి ఇక్కట్లు:
సనాతన హిందూ సంప్రదాయంలో ఏ దైవ కార్యం, శుభకార్యం తలపెట్టినా కుడిచేతితోనే చేయాలి. ఎడమ చేతితో చేస్తే అపచారంగా, తీవ్ర అశుభంగా పరిగణిస్తారు. ఎడమ చేతితో పొరపాటున అపచారం చేస్తే ఇంట్లో పెద్దలతో అక్షింతలు తప్పవు. అలాంటి సందర్భాల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాల్సిందే. కొన్ని సందర్భాల్లో పెద్దలు, తల్లిదండ్రులు చీవాట్లు పెట్టినా రాయడం, ఇతర పనులు ఎడమ చేతితోనే చేస్తుంటారు.