Followers

16 August, 2020

శ్రీ రామకృష్ణ పరమహంస గారి వర్ధంతి


@శ్రీనివాస్@

ఆధ్యాత్మిక గురువు శ్రీ రామకృష్ణ పరమహంస గారి వర్ధంతి నేడు...

శ్రీరాముడు ధర్మస్వరూపుడు. శ్రీకృష్ణుడు ధర్మ సంరక్షకుడు. శ్రీరామకృష్ణ పరమహంస సర్వధర్మస్వరూపంగా పరిగణించబడినాడు. వివేకానందుడు ఇతని ప్రియతమ శిష్యుడు.

సామాన్య పూజారిగా జీవితాన్ని మొదలు పెట్టిన ఇతను కాళీమాత ఉపాసనతో, అనుగ్రహంతో సర్వధర్మసారాన్ని ప్రపంచానికి తెలియజేసి ఆదర్శపురుషుడిగా వెలుగొందినాడు. ఈయన పేరు మీద నేడు రామకృష్ణ మిషన్ ఎన్నో ఆధ్యాత్మిక, సేవా, సాంస్కృతిక కార్య్రక్రమాలను నడుపుతూ ప్రపంచమంతా వ్యాపించింది.

ఆయన కాళిమాతకు వీరభక్తుడు. ప్రియమైన పుత్రుడు. తను పిలిచినప్పుడల్లా పలికి పరమానందానుభూతిలో ముంచెత్తే కాళీమాత ఆయన దృష్టిలో దేవత కాదు, సజీవ సత్యం. ఐతే ఈ ఆనందం కూడా ఒక బంధనమేనన్న ఆలోచన మదిలో మెదలి అంతకుమించిన జ్ఞానాన్ని పొందేదిశగా ప్రయత్నాలు చేసి, రామకృష్ణ పరమహంసగా ఆధ్యాత్మిక చరిత్రలో నిలిచారు.

రామకృష్ణులకు తల్లిదండ్రులు పెట్టిన పేరు గదాధరుడు. చిన్ననాటినుండి చదువు, సంపాదనల మీద ఆసక్తి చూపించని రామకృష్ణులు ప్రకృతిని ప్రేమిస్తూ, ప్రకృతిలోనే విహరిస్తూ సమయాన్ని గడిపేవారు. ఒకనాడు ఆలయంలోని కాళిమాతను చూసి ఆమె బొమ్మకాదని... తను పిలిస్తే పలుకుతుందని నిశ్చయించుకుని ఆ కాళీమాతకు పూజలు చేస్తూ అహర్నిశం అమ్మవారి ధ్యాసలోనే గడిపి అమ్మ దర్శనాన్ని పొందారు.

తోతాపురి అనే సాధువు ఉపదేశించిన అద్వైతజ్ఞానం రామకృష్ణుల జీవితాన్ని మలుపు తిప్పింది. తన భార్య శారదాదేవినే మొదటి శిష్యురాలిగా చేసుకుని తాను గురువు వద్ద నేర్చుకున్న విద్యలన్నీ ఆమెకు నేర్పారు. ఆమెను సాక్షాత్తూ కాళికాదేవిలా భావించి పూజించారు. వివేకానందుడు మొదలుకుని భగవంతుడిని తెలుసుకోవాలనే తపనగల మరెందరికో తన జ్ఞానానుభావాలను పంచారు.

భగవంతుని ఆశ్రయం పొందడానికి అత్యంత ప్రేమతో సాధన చేయాలి. తనకోసం బిడ్డ అటూ ఇటూ పరుగులు పెట్టే బిడ్డను దగ్గరకు తీసుకోని తల్లి ఉంటుందా? అంటూ భక్తికి అనురాగాన్ని ముడివేసేవారు. మనస్సును సరైన దిశలో పయనింపజేస్తే అసాధ్యాలను సుసాధ్యం చేస్తుంది. కానీ దానికి దిశానిర్దేశం చేయడంలో మన వివేకం, విజ్ఞతలను ఉపయోగించకపోతే, అదుపుతప్పిన గుర్రంలా పరుగెడుతుందనే వారి మాట ఆధ్యాత్మికానికే కాదు.... అన్నింటా అనుసంధానించవలసినది. భగవన్నామాన్ని వినడానికి లక్ష చెవులున్నా చాలవు. ఎన్నిసార్లూ ఆ నామాన్ని నోటితో జపించినా తృప్తి కగదు. ఎప్పుడైతే ఆ నామం మనసులో ప్రకంపనలను కలగజేస్తుందో అప్పుడు ఇంద్రియశుద్ధి కలుగుతుంది. కామం, అసూయలనే రెండు శత్రువులను తొలగించుకున్ననాడు భగవంతుని దర్శించడం అందరికీ సాధ్యమవుతుంది. ఇదే వారి జీవనసందేశంగా సాధకులు గ్రహించగలుగుతారు.

No comments:

Post a Comment