💝 నేత్రదానం ఎలా పనికి వస్తుంది?
👉ప్రశ్న: మనిషి బతికి ఉండగా రక్తం, కిడ్నీ వంటి దానాలు చేస్తారు. కానీ వ్యక్తి చనిపోయినా నేత్రదానం పనికి వస్తుంది. ఇది ఎలా సాధ్యం?
👉జవాబు:
◆ కంటిలో నల్ల గుడ్డు భాగాన్ని కప్పుతూ గోళాకారంగా గాజు వలె పారదర్శకంగా ఉండే పల్చటి పొర ‘కార్నియా’. ఇది పారదర్శకంగా ఉన్నంతసేపు దాని గుండా కాంతి ప్రసారమై మనిషి చూడగల్గుతాడు.
◆ కార్నియాకు పారదర్శకత తగ్గితే చూపు మందగిస్తుంది. అంధత్వం వస్తుంది. దీన్నే కార్నియా అంధత్వం అంటారు. మృతుల నుంచి సేకరించిన కార్నియాను తీసి అమర్చడం ద్వారా తిరిగి చూపు లభిస్తుంది. మరి ఏవిధంగాను దీనిని సమకూర్చలేరు.
◆ మనిషి మరణించగానే అతని శరీరంలోని జీవకణాలు అన్నీ మరణిస్తాయి. అటువంటప్పుడు మృతుని కార్నియా ఎలా పనికి వస్తుంది అంటే... మన శరీరంలో అన్ని అవయవాలకు రక్తం ద్వారా ఆక్సిజన్ సరఫరా అవుతుంది. మనిషి మరణంతో శరీరం అచేతనం అవుతుంది. రక్త ప్రసరణం ఆగిపోతుంది. ఆక్సిజన్ సరఫరా నిలిచిపోతుంది. అందువల్ల శరీరంలో అవయవాలు అన్నీ దానానికి పనికిరావు.
◆ కంటి కార్నియాకు రక్తం ద్వారా ఆక్సిజన్ సరఫరా కాదు. అది గాలిలోని ఆక్సిజన్‌ను గ్రహించి సజీవంగా ఉంటుంది. మనిషి మరణించినా గాలిలోని ఆక్సిజన్‌ను తీసుకుంటూ ఈ కార్నియా సజీవంగా ఉంటుంది. ఇలా మరణించిన ఆరు గంటల వరకు కార్నియా సజీవంగా ఉంటుంది.
◆ అందుకే వ్యక్తి మరణించిన ఆరుగంటల లోపులో ‘కార్నియా’ను సేకరిస్తారు.
No comments:
Post a Comment