Followers

16 August, 2020

అటల్ బిహారీ వాజ్ పేయి గారి వర్ధంతి


@శ్రీనివాస్@

నేడు భారతరత్న అటల్ బిహారీ వాజ్ పేయి గారి వర్ధంతి..

భారత దేశ రాజకీయ చరిత్రలోనే అటల్ బిహారీ వాజ్ పేయి రెండు సీట్ల పార్టీని అధికార పార్టీగా మలచిన అపర చాణుక్యుడు. రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని పదిలంగా సుస్థిరపరచుకున్న నేత. ప్రతిపక్షాల విమర్శలకు అంతే స్థాయిలో సమాధానాలు వారి చేతే శభాష్ అనిపించుకునేవారు. దాయాది దేశం పాకిస్థాన్ తో యుద్ధ వాతావరణం సమయంలో తనదైన శైలిలో మాటల తూటాలు వదిలారు. పాకిస్థాన్ దేశంలో ఓ ప్రముఖ నేత రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు వస్తాయి. ఒక చేత్తో ఏమి చేయలేరని అంటే అందుకు వాజ్ పేయి బదులిస్తూ రెండు చేతులు కలిస్తే చప్పట్లు వస్తాయనేది నిజమే కానీ ఒక చేత్తో కనీసం చిటికెలైనా వేయొచ్చని ధీటుగా బదులిచ్చారు.

వాజ్ పేయీ మధ్యప్రదేశ్ రాష్ట్రం గ్వాలియర్లో 1924 డిసెంబర్ 25వ తేదీన క్రిష్ణదేవి, క్రిష్ణబిహారీ వాజ్ పేయీలకు జన్మించారు. ఆయన తండ్రి ప్రధానోపాధ్యాయులు. దీంతో వాజ్ పేయీ ప్రాథమిక విద్య అంతా గ్వాలియర్ లోని సరస్వతి శిశు మందిరంలోనే సాగింది. అనంతరం అక్కడే విక్టోరియా కళాశాలలో గ్రాడ్యుయేట్ పట్టా పొందారు. అనంతరం కాన్పూర్ వెళ్లిన ఆయన ఎంఏ పొలిటికల్ సైన్స్ చేశారు. 1939లో ఆర్ ఎస్ ఎస్ లో చేరారు. 1944 నుండి ఆర్ ఎస్ ఎస్ లో పూర్తి స్థాయి కార్యకర్తగా ఎదిగారు. ఆర్య సమాజ్ కు 1944లో జనరల్ సెక్రటరీగా పనిచేసిన ఆయన విభజన అల్లర్లు కారణంగా విద్యకు మధ్యలోనే స్వస్తి చెప్పారు. అనంతరం ఉత్తరప్రదేశ్ లోని కొన్ని పత్రికల్లో పనిచేశారు. 1975 ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ టైమ్ లో వాజ్ పేయీ కొందరు ప్రతిపక్ష నేతలతో కలిసి జైలుకు కూడా వెళ్లి వచ్చారు.

బిజెపి అగ్రనేత అద్వానీతో కలిసి 1980లో ఏప్రిల్ 6వ తేదీన బిజెపిని స్థాపించారు. అప్పుడు తొలి అధ్యక్షుడిగా ఆయనే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తొలి రోజుల్లో రెండు సీట్లకే పరిమితం అయిన 1996 సాధారణ ఎన్నికలు వచ్చేసరికి ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థాయికి తీసుకెళ్లిన ఘనత వాజ్ పేయీ, అద్వానీలదే. అప్పట్లో తొలిసారిగా కాంగ్రెసేత ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.అనేక నాటకీయ పరిణామాల మధ్య 1999 సంవత్సరంలో ముచ్చటగా మూడోసారి ప్రధాని పీఠాన్ని కైవశం చేసుకున్నారు. 2000లో ఆయన ఎన్నో ప్రతిష్టాత్మక సంస్కరణలు తీసుకొచ్చారు. వాటి ఫలాలే నేడు మనం అనుభవిస్తున్నాం. అవి దేశానికి ఎంతగానో మేలు చేశాయి.ఆయన హయాంలో ఇండియా సక్సెస్ గ్రోత్ ఎంతగానో మెరుగుపడింది.

ఇలా ఆయన గురించి చెప్పుకుంటూ పోతే చెప్పాల్సింది చాలానే ఉంటుంది. ఆయన గురించి ఒక్క మాటలో చెప్పాలంటే అందరినీ నవ్వించడంలో ఆయనకు ఆయనే సాటి. ప్రసంగాల మధ్యలో కవితల్ని కలగలపి అందరితో ఔరా అనిపించుకోవడంలో ఆయనకు ఎవరూ లేరు పోటీ.. ఆయన వాగ్ధాటిని చూసిన అప్పటి ప్రధాని నెహ్రు ఓ సందర్భంలో భవిష్యత్తులో అటల్ జీ ప్రధాని అవుతారని జోస్యం చెప్పారట.

వాజ్ పేయి తమకున్న అభిమానాన్ని బిజెపి తమదైన శైలిలో చాటుకుంది. ఆయన పుట్టినరోజును సుపరిపాలన దినోత్సవంగా ప్రకటించింది మోడీ ప్రభుత్వం. ఆయన చేసిన సేవలను గుర్తించి 2015లో భారత రత్న అవార్డుతో సత్కరించింది. ఆయన మధ్య లేకపోయినా ఆయన ఆశయాలు ఇప్పటికే మన మధ్య సజీవంగానే ఉన్నాయి.

13 August, 2020

నేడు లెఫ్ట్ హ్యాండర్స్ డే

@శ్రీనివాస్@

నేడు లెఫ్ట్‌ హ్యాండర్స్‌ డే

చేయి మారినా రాత మారలేదంటారు. ఎడమ చేతివాటం వారికి మాత్రం ఇది వర్తించదు. ఎందుకంటే లెఫ్ట్‌ హ్యాండర్స్‌ అయితే ప్రముఖులుగా వెలుగొందుతారని ఓ నమ్మకం. ఎందరో దేశాధినేతలు, క్రీడాకారులు, నటీనటులు లెఫ్ట్‌ హ్యాండర్స్‌ కావడం ఈ నమ్మకాన్ని నిజం చేస్తోంది. ఎడమ చేతివాటం ఉన్న వారిలో అసాధారణ ప్రతిభాపాటవాలు ఉంటాయని, ప్రత్యేక వ్యక్తులుగా వెలుగొందుతారని అంటారు.

ఏదైనా పని ప్రారంభించేటప్పుడు ‘కుడి’ పదం వాడడం సర్వసాధారణం. కుడి చేతితో చెయ్యి, కుడికాలు పెట్టు...అన్నమాటలు తరచూ వింటుంటాం. శరీర అవయవాల్లో దేని ప్రాముఖ్యం దానిదే అయినా మనిషి జీవనం సాఫీగా సాగేందుకు ఎంతో ముఖ్యమైనవి కాళ్లు, చేతులు. ప్రయాణానికి కాళ్లు, పనులు చేసేందుకు చేతులు ప్రధానం. చేతుల్లో కుడి చేతివాటం, ఎడమ చేతివాటం వారని రెండు రకాలు. చేసేపని ఒక్కటే అయినా ఒక్కొక్కరికీ ఒక్కో చేతితో చేయడం సౌలభ్యంగా ఉంటుంది. అయితే జనాభాలో 90 శాతం మంది కుడిచేతితోనే ఏదైనా పనిచేస్తారు. మిగిలిన పది శాతం ఎడమచేతివాటం. అందుకే వారు ప్రత్యేకం. ప్రతి పదిమందిలో ఒకరు ఎడమ చేతివాటం వారని అంచనా. ఎడమ చేతివాటం అన్నది శారీరకంగా, మానసికంగా అబ్బి న అలవాటు. కొందరు పిల్లలు అన్నిపనులు ఎడమచేతితోనే చేస్తుంటారు. ఇటువంటి వారికి తల్లిదండ్రులు కుడిచేతితో తినడం, ఇతర పనులు బలవంతంగా అలవాటు చేస్తుంటారు. అయినప్పటికీ కొంతమందికి ఇవి అబ్బవు. ముఖ్యంగా పనులు చేయడం, రాయడం వంటివి మారడం చాలా అరుదు. ఇది ఒక శారీరక, మానసిక ప్రక్రియ అని విశ్లేషకులు భావిస్తున్నారు.

నలభై ఏళ్ల తరువాత ఎవరికైనా పిల్లలు పుడితే సాధారణంగా వారు ఎడమచేతి వాటం వారై ఉంటారని చెబుతారు. బిడ్డ తల్లిగర్భంలో ఉన్నప్పుడు వాతావరణంలో మార్పులు కారణంగా 75 శాతం ఎడమ చేతివాటం వస్తుందని, కొన్ని సర్వేల్లో తేలింది. జన్యువులు కారణంగా ఎడమ చేతివాటం రావడానికి 25 శాతం అవకాశం ఉంది. ఎడమచేతివాటం వారు గొప్ప అదృష్టవంతులవుతారని, ప్రత్యేక గుణాలు కలిగి ఉంటారని, సమాజంలో పేరు ప్రఖ్యాతులు సాధిస్తారని, గర్వించదగ్గ విజయాలు నమోదు చేస్తారని పలుసందర్భాల్లో నిరూపితమైంది. అందుకే ఎడమ చేతి వాటానికి అంత ప్రాముఖ్యం.

ఫ్రెండ్‌షిప్‌డే, మదర్స్‌డే, ఫాదర్స్‌డే, వాలంటైన్‌ డేలా ఆగస్టు 13న అంతర్జాతీయ ఎడమచేతివాటం వ్యక్తుల దినోత్సవం (లెఫ్ట్‌హ్యాండర్స్‌ డే) జరుపుతున్నారు. ఎడమచేతివాటం వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు 1976 ఆగస్టు 13 నుంచి ఈ దినోత్సవాన్ని నిర్వ హిస్తున్నారు.

ఎడమచేతి వాటం వారిలో ప్రపంచ వ్యాప్తంగా రాజకీయ, సామాజిక, క్రీడా రంగాల్లో ఎందరో ప్రముఖులు ఉన్నారు. రాణీలక్ష్మీబాయి, మహాత్మాగాంధీ, ప్రధాని నరేంద్ర మోదీ, ఆల్‌బర్ట్‌ ఐన్‌స్టీన్‌, చార్లెస్‌ డార్విన్‌, న్యూటన్‌, బెంజిమిన్‌ ప్రాంక్లిన్‌, బిల్‌క్లింటన్‌, జార్జిబుష్‌, ఒబామా, రతన్‌టాటా, సచిన్‌ టెండూల్కర్‌, రవిశాస్త్రి, సౌరవ్‌గంగూలీ, యువరాజ్‌ సింగ్‌, సురేష్‌ రైనా, శిఖర్‌థావన్‌, కుంబ్లే, జహీర్‌ ఖాన్‌, అమితాబచ్చన్‌, అభిషేక్‌ బచ్చన్‌, మహానటి సావిత్రి, సూర్యాకాంతం, మమ్ముట్టి ఇలాంటి ప్రముఖులు ఉన్నారు.

ఎడమచేతి వాటం వారి లక్షణాలు:
కలలు కంటారు. వాటి సాకారానికి శక్తి వంచన లేకుండా శ్రమిస్తారు.
స్వతంత్ర భావాలు, జ్ఞాపక శక్తి మెండు. నిత్యనూతనంగా (సృజనాత్మకత) ఆలోచనా విధానం వీరి సొంతం.
ఎంత ఒత్తిడినైనా తట్టుకునే గుణం వీరి సొంతం.
ఒకేసారి ఎక్కువ పనులు చేయగల సత్తా ఉండడం వల్ల బహుళ లక్ష్యాల సాధనలో ప్రావీణ్యం కలిగి ఉంటారు.
చిత్రాలు గీసేటప్పుడు అవి కుడివైపు అభిముఖంగా ఉంటేటట్టు గీస్తారు. ఎడమవైపు తిరిగి ఉన్న చిత్రాలు గీయడానికి చాలా కష్టపడతారు.
బ్రెయిన్‌ స్ట్రోక్‌ వచ్చినా కుడిచేతి వాటం వారి కంటే త్వరగా కోలుకుంటారు.
కుడిచేతివాటం వారి కోసం రూపొందించిన పరికరాల వినియోగం వల్ల ఏటా 2,500 మంది ఎడమ చేతివాటం వారు మృతి చెందుతున్నట్లు సర్వేలు చెబుతున్నాయి.
వీరికి అసహనం, కోపం తొందరంగా వస్తాయి.
కళ, భాష, సంగీత రంగాల్లో వీరు ఎక్కువగా రాణిస్తారు. మొదడు, మనోవ్యాధులతో సతమతమవుతుంటారు.

 ఎడమచేతి వాటం వారి ఇక్కట్లు:
సనాతన హిందూ సంప్రదాయంలో ఏ దైవ కార్యం, శుభకార్యం తలపెట్టినా కుడిచేతితోనే చేయాలి. ఎడమ చేతితో చేస్తే అపచారంగా, తీవ్ర అశుభంగా పరిగణిస్తారు. ఎడమ చేతితో పొరపాటున అపచారం చేస్తే ఇంట్లో పెద్దలతో అక్షింతలు తప్పవు. అలాంటి సందర్భాల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాల్సిందే. కొన్ని సందర్భాల్లో పెద్దలు, తల్లిదండ్రులు చీవాట్లు పెట్టినా రాయడం, ఇతర పనులు ఎడమ చేతితోనే చేస్తుంటారు.

శ్రీదేవి గారి జయంతి

@శ్రీనివాస్@

నేడు ప్రముఖ నటి "శ్రీదేవి" గారి జయంతి

'పూలరెక్కలు. కొన్ని తేనె చుక్కలు. రంగరిస్తవో..ఇలా బొమ్మ చేస్తివో. అసలు భూలోకం  ఇలాంటి సిరి చూసి ఉంటదా. కనక ఈ చిత్రం   స్వర్గానికి చెంది ఉంటదా?’ ఇది సీతారామశాస్త్రి గారు శ్రీదేవి గారిని గూర్చి వ్రాసిన పంక్తులు.. అందానికే అసూయ పుట్టే అందం ఆమెది.. నేడు ఆ అతిలోకసుందరి జయంతి సందర్భంగా కొన్ని విషయాలు..

దశబ్ధాలపాటు వెండి తెరనేలిన తారా రాణి శ్రీదేవి జయంతి నేడు. ఆ అందాల నటి శ్రీదేవి ఈ ‘తెర’మరుగై ఏడాది దాటిపోతుంది. 1963 ఆగస్టు 13న శ్రీదేవి తమిళనాడులో జన్మించారు. నాలుగేళ్ళ ప్రాయంలో శ్రీదేవి ‘కాంధన్ కరుణై’ చిత్రంతో బాలనటిగా చిత్ర పరిశ్రమకు పరిచమయ్యారు. చక్కని రూపంతో, తక్కువ ప్రాయంలోనే అద్భుత నటన కనబరుస్తున్న శ్రీదేవి పదుల సంఖ్యలో బాలనటిగా అవకాశాలు దక్కించుకున్నారు. ఇక 1978లో భారతీరాజా దర్శకత్వంలో వచ్చిన ’16వయతినిలే’ చిత్రంతో మొదటిసారిగా పూర్తిస్థాయి నటిగా మారారు. ఈ చిత్రంలో కమల్ హాసన్, రజని నటించడం విశేషం. ఇదే చిత్రాన్ని దర్శకుడు రాఘవేంద్ర రావు, ‘పదహారేళ్ళ వయసు’ పేరుతో ఆమెతోనే తెలుగులో రీమేక్ చేయగా రెండు భాషల్లో ఈ మూవీ విశేష ఆదరణ దక్కించుకుంది.

ఇక ఎనభై ,తొంబై దశకాలలో రెండు తరాల టాప్ హీరోలైన ఎన్టీఆర్,ఏఎన్ఆర్,కృష్ణ, శోభన్ బాబు తోపాటు, చిరంజీవి,వెంకటేష్,నాగార్జునలతో ఈమె నటించారు. శ్రీదేవి 1994 చిరంజీవితో నటించిన ‘ఎస్పీ పరుశురాం’ తెలుగులో చివరి చిత్రం. బాలీవుడ్ లో అప్పటికే అనేక చిత్రాలు చేసిన శ్రీదేవి 1994 తరువాత హిందీ చిత్రాలకే పరిమితమయ్యారు. అద్భుత విజయాలతో టాప్ స్టార్స్ పక్కన నటిస్తూ, తిరుగులేని తారగా ఎదిగారు. బాలీవుడ్ పై ఆధిపత్యం చెలాయించిన మొదటి సౌత్ హీరోయిన్ గా శ్రీదేవి మిగిలిపోయారు.

ఇక 1996లో బాలీవుడ్ నిర్మాత బోని కపూర్ ని శ్రీదేవి వివాహం చేసుకున్నారు. అప్పటికే బోని కపూర్ కి పెళ్ళై పిల్లలు ఉన్నారు. పెళ్ళైన తరువాత చిత్రాలలో నటించడం తగ్గించిన శ్రీదేవి, గతకొన్నేళ్ళుగా కధానాయిక ప్రాధాన్యం చిత్రాలలో నటిస్తున్నారు. దేశంలోని అన్ని ప్రముఖ భాషలలో నటించిన శ్రీదేవి 300పైగా చిత్రాలలో నటించారు.ఓ వేడుకలో పాల్గొనడానికి దుబాయ్ వెళ్లిన ఆమె 2018 ఫిబ్రవరి 24న ఓ హోటల్ లోని స్నానపు గదిలో ప్రమాదవశాత్తు బాత్ టబ్ లో పడి మరణించడం జరిగింది.అయితే ఆమె మరణం పై అనేక అనుమానాలున్నాయి.

రావుగోపాలరావు గారి వర్ధంతి


@శ్రీనివాస్@

నేడు ప్రముఖ తెలుగు సినిమా నటుడు మరియు రాజ్యసభ సభ్యుడు "రావుగోపాలరావు" గారి వర్ధంతి

రావుగోపాలరావు (జనవరి 14, 1937 - ఆగష్టు 13, 1994)

సెగట్రీ! సూరీడు నెత్తుటి గడ్డలా లేడూ!ఆకాసంలో ఎదో మర్డరు జరిగినట్టు లేదూ.... ఎప్పుడూ యదవ బిగినెస్సేనా. మడిసన్నాక కుసంత కలాపోసనుండాల. తిని తొంగుంటే మడిసికీ గొడ్డుకూ తేడా ఏముంటది?ఇలాంటి డైలాగులు వింటే మనకు రావుగోపాలరావు గారు వెంటనే గుర్తుకు వస్తారు.నేడు ఆయన వర్ధంతి సందర్భంగా కొన్ని విషయాలు..

ఆయన నట జీవితం ముత్యాల ముగ్గు చిత్రంలోని కొంపలు కూల్చే కంట్రాక్టర్ వేషంతో గొప్ప మలుపు తిరిగింది. అప్పట్లో ఆ చిత్రంలో ఆయన డైలాగులు మారుమోగిపోయాయి. ఆడియో క్యాసెట్స్, రికార్డుల అమ్మకాలలో రికార్డులు సృష్టించాయి. తరువాత తెలుగు సినిమా విలనీలోనే కొత్తదనానికి రావుగోపాలరావు కొత్త రూపునిచ్చారు.
వీటిలో ఆయన డైలాగ్ మాడ్యులేషన్ వలనే అనేది ప్రత్యేకంగా చెప్పవలసినది. వేటగాడు చిత్రంలో యాస పాత్రతో కూడిన పెద్ద పెద్ద డైలాగ్స్ తో రావుగోపాలరావు జనం హృదయాలని మరోసారి కొల్లగొట్టుకున్నారు.

గోపాలరావుగారి అమ్మాయి చిత్రంలో వయసు మళ్ళినా వయసులో వున్నట్లు కనిపించే పాత్రలో, అలాగే మావూళ్ళో మహాశివుడు, స్టేషన్ మాస్టర్, వింత దొంగలు, రావుగోపాలరావు, మనవూరి పాండవులు, ఈనాడు లాంటి చిత్రాలలో ఆయన నట విశ్వరూపం కనిపిస్తుంది. రంగస్థల నటుడుగా భమిడిపాటి రాధాకృష్ణ రచించిన 'కీర్తిశేషులు' నాటకంలోని పాత్రతో ప్రాముఖ్యత సంతరించుకున్న రావు గోపాలరావు కాకినాడలో కొంతకాలం అసోసియేటెడ్‌ అమెచ్యూర్‌ డ్రామా కంపెనీ నెలకొల్పి పలు నాటకాలు ప్రదర్శించారు.

కాకినాడ సమీపంలోని గంగనపల్లి లో జనవరి 14, 1937 లో జన్మించారు. రావు గోపాలరావు నాటకాలను చూసి ఎస్‌.వి.రంగారావు మెచ్చుకుంటూ గుత్తా రామినీడుకి పరిచయం చేస్తే 'భక్తపోతన' చిత్రానికి అసిస్టెంట్‌ డైరక్టర్‌గా పెట్టుకున్నారు. 'బంగారు సంకెళ్లు, మూగప్రేమ' చిత్రాలకు సహాయ దర్శకుడుగా పనిచేసి, 'జగత్‌ కిలాడీలు' చిత్రంలో నటించి విలన్‌ అనిపించుకున్నారు. ఆ చిత్రానికి ఆయన కంఠస్వరం నచ్చక వేరొకరితో డబ్బింగ్‌ చెప్పించారు నిర్మాతలు. బాపు దర్శకత్వంలో రూపొందిన భక్తకన్నప్ప, గోరంత దీపం, మనవూరి పాండవులు, కలియుగ రావణాసురుడు, త్యాగయ్య, జాకీ, బుల్లెట్‌, చిత్రాలు ఆ చిత్రాల్లోని డైలాగ్స్‌ గుర్తిండిపోతాయి. ఇదే ఊపును మగధీరుడు, కొండవీటి రాజా, కిరాయి రౌడీలు, ఖైదీ, కటకటాల రుద్రయ్య, జస్టిస్‌ చౌదరి, గోపాలరావుగారి అమ్మాయి, ఘరానా మొగుడు, దేవాలయం, చండశాసనుడు, బొబ్బిలిపులి, బొబ్బిలి బ్రహ్మన్న, అనుగ్రహం, అల్లరి ప్రియుడు, అభిలాష, యమగోల తదితర చిత్రాల్లోనూ ప్రదర్శించారు. పార్లమెంటు సభ్యునిగా ఆరేళ్ళపాటు కొనసాగారు.విలన్‌గా, కామెడీ విలన్‌గా, కేరక్టర్‌ ఆర్టిస్టుగా రాణించారు.

ఇతనికి 1990 సంవత్సరంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ (గౌరవ డాక్టరేట్) ప్రదానం చేసింది. ఈయన కుమారుని పేరు రావు రమేశ్. ఇతను కూడా మంచి నటుడుగా పేరు తెచ్చుకున్నాడు. మగధీర,కొత్త బంగారు లోకం,గమ్యం వంటి చిత్రాలతో మంచి గుర్తింపు పొందాడు.

రావు గోపాలరావు గారు 1994, ఆగష్టు 13 న దివంగతులయ్యారు.

పైడిమర్రి వెంకటసుబ్బారావు గారి వర్ధంతి

@శ్రీనివాస్@

విద్యార్థుల్లో దేశభక్తిని నింపుతున్న 'ప్రతిజ్ఞ' రూపశిల్పి "పైడిమర్రి వెంకటసుబ్బారావు" గారి వర్ధంతి నేడు...

బడి గంట కొట్టగానే విద్యార్థులందరూ బారులుదీరి వందేమాతర గీతం ఆలపిస్తారు.. ఆ తర్వాత ‘‘భారత దేశం నా మాతృభూమి/భారతీయులందరూ నా సహోదరులు/ నేను నా దేశమును ప్రేమించుచున్నాను...’’ అంటూ దేశంలోని ప్రతి పాఠశాలలో పిల్లలు ప్రతిజ్ఞ పూనుతారు. పసి హృదయాల్లో అణుఅణువునా దేశభక్తిని ఉప్పొంగించే ఆ ప్రతిజ్ఞ రాసింది మరెవరో కాదు నల్లగొండ జిల్లా వాసి పైడిమర్రి వెంకటసుబ్బారావు. తెలుగుతోపాటు సంస్కృతం, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ, గుజరాతీ, మరాఠీ.. తొమ్మిది భాషల్లోకి అనువాదమై దేశమంతా పఠిస్తున్నారు ఆయన వ్రాసిన ఈ ‘ప్రతిజ్ఞ’...

పైడిమర్రి వెంకట సుబ్బారావు జూన్‌10, 1916న నల్లగొండ జిల్లా అన్నెపర్తిలో జన్మించారు. ఆయన విద్యాభ్యాసం అంతా నల్లగొండ జిల్లాలోనే సాగింది. ఆయనకు తెలుగు, సంస్కృతం, హిందీ, ఇంగ్లిషు, అరబిక్‌ భాషల్లో ప్రావీణ్యం ఉంది. హైదరాబాద్‌ ట్రెజరీ శాఖలో ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన పైడిమర్రి ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడిన తర్వాత ఖమ్మం, నిజామాబాద్‌, నెల్లూరు తదితర ప్రాంతాల్లో పనిచేశారు. 1962లో భారత్‌-చైనా యుద్ధం సందర్భంగా ‘తమ దేశంలోని పిల్లలందరికీ ప్రాథమిక దశ నుంచే దేశభక్తిని పెంపొందించాలని చైనా నిర్ణయించింది’. ఆ విషయాన్ని గుర్తించిన పైడిమర్రి మన దేశ బాలలందరి గుండెల్లో దేశ భక్తిని నింపాలన్న కాంక్షతో ‘భారత దేశం నా మాతృభూమి’ ప్రతిజ్ఞ రాశారు. ఆ రచనను చదివి ఉప్పొంగిన సాహితీవేత్త తెన్నేటి విశ్వనాథం, ఆ విషయాన్ని నాటి విద్యాశాఖ మంత్రి పీవీజీ రాజు దృష్టికి తీసుకెళ్లారు. ఆ ప్రతిజ్ఞ ఔన్నత్యాన్ని వివరిస్తూ రాతప్రతిని అందజేశారు. ఆ తర్వాత బెంగళూరు వేదికగా జరిగిన కేంద్రీయ విద్యా సలహా మండలి సమావేశంలో దాన్ని జాతీయ ప్రతిజ్ఞగా గుర్తించారు. దేశంలోని 9 భాషల్లో అనువదించి అన్ని పాఠశాలల్లో ఆ ప్రతిజ్ఞను పిల్లలతో నిత్యం చదివించాలని ఆదేశాలు జారీ చేశారు. జనవరి 26, 1965 నుంచి ప్రతి పాఠశాలలో విద్యార్థులతో ఆ ప్రతిజ్ఞ చేయించడం అధికారికంగా మొదలైంది.

పైడిమర్రి వెంకటసుబ్బారావు తన 18వ ఏట ‘కాలభైరవుడు’ నవల రాశారు. ‘దేవదత్తుడు’, ‘తులసీదాసు’, ‘త్యాగరాజు’ మొదలైన పద్యకావ్యాలు రచించారు. ‘బ్రహ్మచర్యం’ వంటి పలు నాటకాలతోపాటు వెట్టిచాకిరీని నిరసిస్తూ ఎన్నో కథలు ఆయన కలం నుంచి జాలువారాయి. ‘గోలకొండ’, ‘సుజాత’, ‘ఆంధ్రపత్రిక’, ‘ఆనందవాణి’ తదితర పతిక్రల్లో పైడిమర్రి రచనలు ప్రచురితమయ్యాయి. 1945లోనే ‘ఉషస్సు కథలు’ సంపుటిని రచించి తొలి తరం కథారచయితగా నిలిచారు. పైడిమర్రి రాసిన ప్రతిజ్ఞ అన్ని భారతీయ భాషల్లో అనువాదమైనా.. ఆయనకు రావలసిన గుర్తింపు రాకపోవడం  గమనార్హం.